మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు జిల్లాలో భద్రాచలం, పాల్వంచ, టేకులపల్లి, దమ్మపేట మండలాల్లో ప్రత్యేక గోదాములు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ధాన్యం కొనుగోలు, దిగుమతి తదితర అంశాలపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా భద్రపరిచేందుకు నాలుగు తాత్కాలిక గోదాములను సిద్ధం చేసినట్లు ఆయన సూచించారు. అకాల వర్షాల వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయని రానున్న నాలుగైదు రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని రైతులు సంయమనం పాటించి యంత్రంగానికి సహకరించాలని ఆయన సూచించారు. రైతుల ఎవరూ అధైర్య పడుద్దని రాబోవు వారం రోజుల్లో దాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాటా వేసిన తదుపరి సిఎంఆర్ మిల్లుల వద్ద డౌన్లోడ్ చేయడంలో ఎండ తీవ్రత వల్ల హమాలీలు వడదెబ్బకు గురై సకాలంలో దిగుమతి చేయలేకపోతున్నారని, అందువల్ల జాప్యం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో దిగుమతి సమస్య పరిష్కారం అవుతుందని రైతులు అధైర్యపడొద్దని ఆయన సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు ఎలాంటి అపోహలకు, ఆందోళనకు గురికాకుండా ర సంయమనం పాటించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకురావాలని ఆయన సూచించారు.