మన్యం న్యూస్: జూలూరుపాడు, మే 29, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని భీమ్లా తండాలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కు గ్రామసభలో లాటరీ ద్వారా ఎంపికైన మాకు ఇండ్లను కేటాయించకుండా అన్యాయం చేశారంటూ సోమవారం స్థానిక ఎంపీపీ లావుడ్యా సోనీ ఇంటిని లబ్ధిదారులు ముట్టడించారు. గత 14 రోజులుగా మండుటెండలో అనేక రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇటు అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గాని మాగోడు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిండు గ్రామసభలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా ఎంపికైన మాకు ఇండ్లను కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నించారు. మాకు కేటాయించిన ఇండ్లలో అనధికారికంగా ఆక్రమించుకొని నివాసముంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించి మా ఇండ్లను మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్థానిక ప్రజా ప్రతినిధులకు, జిల్లా, మండల స్థాయి సంబంధిత అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం వెనక ఆంతర్యమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని మా పరిస్థితిని, ఆవేదనను అర్థం చేసుకొని ఇకనైనా మాకు న్యాయం చేయాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను అభ్యర్థిస్తున్నారు. లేనిపక్షంలో తీవ్ర స్థాయిలో నిరసనకు దిగుతామని హెచ్చరించారు.