మన్యంన్యూస్,ఇల్లందు:తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లందు మాజీ మున్సిపల్ ఛైర్మెన్ మడత రమా వెంకట్ గౌడ్ నివాసంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముందుగా కేక్ కటింగ్ చేసి ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో మడత దంపతులు మాట్లాడుతూ…ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోకుండా వివక్షకు గురైన తెలంగాణ ప్రజల సమస్యలు ప్రత్యేక రాష్ట్రం వస్తే అయినా జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి కంకణం కట్టుకోవడం జరిగిందన్నారు. ఆనాటి ఉద్యమానికి తెలంగాణ ప్రజలు, యువత బాసటగా నిలబడ్డారని, సకలజనులు పాల్గొన్న ఉద్యమ సమయంలో ఎందరో విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విద్యార్థుల బలిదానాలు చూడలేక ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలుగురాష్ట్రాల్లో అధికారం కోల్పోయే సూచనలు ఉన్నట్లు పలు సర్వేలు, రాజకీయ విశ్లేషకులు చెప్పినప్పటికీ వేటినీ ఖాతరు చేయకుండా కరీంనగర్ సభలో తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయడం జరిగిందని పేర్కొన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో నేడు ఎందరో అమరుల కలలు సాకారమయ్యయా అని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వనరులు, నిధుల విషయంలో సీఎం కేసీఆర్ సఫలీకృతులయ్యారా అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో గతంలో కన్నా అభివృద్ధి జరిగిన మాట వాస్తవం అయినప్పటికీ ప్రత్యేకరాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్, తీసుకొచ్చేందుకు కృషి చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలలో రానున్న ఎన్నికల్లో ప్రజల సానుభూతి ఏ పార్టీకి దక్కి అధికారంలోకి వస్తుందో కాలమే నిర్ణయిస్తుంది అన్నారు. ఈ విషయమై తాము వచ్చేనెల వరకు ఇల్లందు పట్టణవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టనున్నామని ప్రజాభీష్టం మేరకు తాము కాంగ్రెస్ పార్టీలో చేరతామా, బీఆర్ఎస్ పార్టీలో చేరతామా అనేది ప్రజలకు తెలియజేస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా తమ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన నిర్ణయం వచ్చేనెల చివరలో ఉంటుందని మడత దంపతులు తెలియజేశారు.