- మండల వ్యాప్తంగా ఘనంగా రైతు వేడుకలు
- ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, డప్పు వాయిద్యాలతో ర్యాలీలు
- రైతుల సహబంతి భోజనాలు
మన్యం న్యూస్: జూలూరుపాడు, జూన్ 03, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవ రైతు వేడుకలలో భాగంగా శనివారం మండల పరిధిలోని జూలూరుపాడు, పాపకొల్లు, నర్సాపురం, కాకర్ల గ్రామాలలోని రైతు వేదికలలో రైతు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైతు వేదికల క్లస్టర్ పరిధి గ్రామాలలోని రైతులంతా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, డప్పు వాయిద్యాలతో సందడి చేస్తూ, ర్యాలీలు నిర్వహించారు. సభ వేదికల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి నివేదికలను అధికారులు రైతులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా గ్రామాలలో వ్యవసాయ రంగంలో సత్ఫలితాలు సాధించిన ఉత్తమ రైతులను ఎంపిక చేసి, వారిని సగౌరవంగా సన్మానించారు. అనంతరం రైతులంతా కలసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.