ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ బీజేపీ కొత్త లెక్కలు తెర మీదకు తెస్తోంది. కేంద్ర కేబినెట్..పార్టీ ప్రక్షాళన దిశగా ప్రధాని మోదీ..
అమిత్ షా బ్లూ ప్రింట్ సిద్దం చేసారు. అందులో భాగంగా ఏపీ, తెలంగాణలో చేపట్టాల్సిన మార్పుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మార్పు ఖాయమని సమాచారం. వైసీపీ రెబల్ ఎంపీ రఘరామ బీజేపీలో చేరనున్నట్లు చర్చ జరుగుతోంది.
బీజేపీ భారీ ప్రక్షాళన
కేంద్ర ప్రభుత్వంలో భారీ మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్దమైంది. ఈ నెల 3న కేంద్ర మంత్రులు..సహాయ మంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ అయిదు రాష్ట్రాల ఎన్నికలు..వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రభుత్వం..పార్టీలో చేయనున్న మార్పుల గురించి వివరించనున్నారు.
అందులో భాగంగా ఆ భేటీ ముగియగానే పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ మంత్రులను పార్టీ బాధ్యతల్లో నియమించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేయాల్సిన మార్పుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మార్పు
తెలంగాణలో బండి సంజయ్ మార్పు పైన పార్టీ నాయకత్వం తేల్చుకోలేకపోతోంది. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. కిషన్ రెడ్డికి అప్పగించేలా కసరత్తు కొనసాగుతోంది. లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు మార్పు పైన ఢిల్లీలో చర్చ జరుగుతోంది.
ఏపీ కంటే తెలంగాణ పైన బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ విస్తరణలో ఎవరికీ ఛాన్స్ ఉండదని సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. దగ్గుబాటి పురంధేశ్వరి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అదే సమయంలో బీసీ వర్గాలకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ పేరు పార్టీ పరిశీలిస్తోందని సమాచారం.
బీజేపీలోకి ఎంపీ రఘురామ
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీ ఎన్నికైన రఘురామ రాజు పార్టీతో..నాయకత్వంలో విభేదించారు. ఢిల్లీకే పరిమితం అయ్యారు. గతంలో బీజేపీలో పని చేసిన రఘురామ రాజు తిరిగి ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ బీజేపీలో చేరుతారని సమాచారం. రఘురామ ఇప్పటికే చంద్రబాబు..పవన తో సన్నిహితంగా ఉంటుండటంతో ఈ రెండు పార్టీల్లో ఒక పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు.