మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 22: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరం అయ్యే వరకు పంచాయితీ కార్మికులకు అండగా నేనుంటానని మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్లో గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం 17వ రోజు కు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సమ్మె చేస్తున్న వారి వద్దకు వెళ్లి వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు మల్టీపర్పస్ విధానం రద్దు చేయటం, కనీస వేతనం అమలు చేయటం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జారి ఆదినారాయణ, జూపల్లి రమేష్, అశ్వరావుపేట సర్పంచ్ రమ్య, నరేష్, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, ములకలపల్లి, దమ్మపేట మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అశ్వరావుపేట గ్రామపంచాయతీ మండల జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.