మన్యం న్యూస్,ఇల్లందు:మణిపూర్లో మహిళలపై జరిగిన అమానవీయ సంఘటనను నిరసిస్తూ శనివారం పట్టణంలోని పాతబస్టాండ్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు అవునురి మధు మాట్లాడుతూ..మణిపూర్లో మహిళలపై జరిగిన అమానవీయ సంఘటన తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మణిపూర్లోని కాంగ్ సాక్సి, జిల్లాలో కుకీతెగకు చెందిన ఆదివాసి మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన భారతదేశానికే అవమానమని, ప్రపంచదేశాలలో భారతదేశ పరువు ప్రతిష్టను బజారున పడేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా మణిపూర్లో హింసాత్మక సంఘటనలు చెలరేగుతున్నప్పటికీ భారతదేశ ప్రధాని నోరుమెదపకుండా ఉండడం ఏమిటని విమర్శించారు. కుల, మతాల పేరుతో ఆకతాయిలు రెచ్చిపోయి ఏకంగా భర్తలముందే భార్యల బట్టలు ఊడదీసి అత్యాచారం చేసి నడిరోడ్డు మీద ఊరేగించి భారతదేశ పరువు ప్రతిష్టను అప్రదిష్టిపాలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికృతచర్యలకు పాల్పడిన అగంతకులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కఠినంగా శిక్షపడే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోది చర్యలు తీసుకోని బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దేవరకొండ శంకర్, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, వివిధ పార్టీల నాయకులు తుపాకుల నాగేశ్వరావు, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు పర్చురి వెంకటేశ్వరరావు, నబి, నాయినిరాజు, బుర్రవెంకన్న, డి.ప్రసాద్, బానోతు రామ్సింగ్, పొడుగు నరసింహారావు, చింత ఉదయ్, ఎట్టి నరసింహారావు, రామచందర్, సర్పంచులు మోకాళ్ళ కృష్ణ, సంతు, సరోజినీ తదితరులు పాల్గొన్నారు.