- ఎక్కడ చెత్త అక్కడే
- పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం
- పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల ప్రమాదం
- శానిటేషన్ పనులు ప్రారంభించాలని కోరుతున్న ప్రజలు
మన్యం న్యూస్: జూలూరుపాడు, జులై 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ, గత 15 రోజులుగా సమ్మె బాట పట్టిన కారణంగా, జూలూరుపాడు మండల వ్యాప్తంగా పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాలలో ఏ వీధిలో చూసిన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పల్లెల్లోని అంతర్గత రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ఒకవైపు పారిశుద్ధ్య పనులు నిలిచిపోయి, మరోవైపు ఎడతెరిపిలేని వర్షాల కారణంగా, గ్రామాలలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి భయంకరమైన సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, గ్రామాలలో బ్లీచింగ్, క్లోరినేషన్, పాగింగ్ వంటి శానిటేషన్ పనులు ప్రారంభించాలని మండల అధికార యంత్రాంగాన్ని ప్రజలు కోరుతున్నారు.