మన్యం న్యూస్(భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి):
బిజెపి విధానాలను నిరసిస్తూ, మణిపూర్ రాష్ట్రంలో చెలరేగుతున్న అల్లర్లపై స్థానిక టీఎస్ యూటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కృష్ణ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. సమావేశంలో ప్రజా సంఘాల వక్తలు లిక్కి బాలరాజు, మందలపు జ్యోతి, కాలంగి హరికృష్ణ, బుర్ర వీరభద్రం, మల్లెల రామనాథం, గంధం మల్లికార్జున రావు, వెంకటేశ్వర్లు, కాంపాటి పృథ్వి, జర్పుల ఉపేందర్,
ఎస్.వెంకటేశ్వర్లు, నందిపాటి రమేష్, గడ్డం రాజశేఖర్, అజ్మీర సురేష్, నరసింహారావు, సాయిరాం మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజల మధ్య దాడులకు ప్రేరేపించి లాభం పొందాలని యోచిస్తోందన్నారు. దీనికి ఉదాహరణే మణిపూర్ లో చెలరేగిన జాతుల మధ్య అంతర్యుద్ధం అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో మైతేయిలు, కూకీలు మధ్య రెండు అంశాల్లో వైరుధ్యం మొదలైందన్నారు. రాష్ట్ర జనాభాలో మైతేయీలు మెజారిటీ వర్గంగా ఉన్నారనీ వీరిలో హిందూ మతస్థులుగా కొందరు ముస్లింలుగా రాష్ట్ర అసెంబ్లీలో 60 సీట్లలో 41 సీట్లు వీళ్ళే ఉన్నారన్నారు. కూకీలు మైనారిటీ వర్గంగా ఉన్నారని రాష్ట్రంలో అత్యధిక భూభాగం వీరిచేతుల్లోనే ఉందనీ కూకీలు నివసించే ప్రాంతాల్లో ఆర్టికల్ 371
(సి)అమలులో ఉన్నందున భూములు కొనేందుకు అమ్మేందుకు అవకాశం ఉండదన్నారు. పాలకులు మైతేయిల రూపంలో కూకీలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. మైతేయీలను గిరిజన తెగగా గుర్తించాలని కూకీల చేతుల్లోని భూముల అమ్మకం కొనుగోలుకు స్వేచ్ఛా మార్కెట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కూకీలు మైతేయీలను గిరిజనులుగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తూ శాసన సభలో తమకు తగు ప్రాధానిధ్యం కల్పించాలని జాతి స్వయం ప్రతిపత్తిని కాపాడాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మైతేయీలను రెచ్చగొడుతూ కూకీల భూములు స్వాహా చేసి రియల్టర్లకు బడా బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం సామాన్య ప్రజానీకంపై మహిళలు ఉద్యోగులపై దాడులకు భారత సమాజాకి సిగ్గుచేటన్నారు. జాతుల మధ్య చిచ్చురేపి లబ్ధి పొందాలనుకునే ఇటువంటి రాజకీయ దుశ్చర్యలను ఖండించాలన్నారు. ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి మానభంగం చేసి ఊరేగించిన ఘటన సమాజం తలదించుకునేలా ఉందన్నారు. సుప్రీంకోర్టు సైతం మైతేయీలను గిరిజనులుగా గుర్తించాలని హుకుం జారీ చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని అర్థం చేసుకోవాలన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు కార్యాచరణ ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో తాండ్ర వెంకటేశ్వర్లు, శశికుమార్, సందకూరి లక్ష్మి, నరసింహారావు, యూత్ కాంగ్రెస్ నాయకులు, నాగకృష్ణ, రాంచరణ్, భవ్య, ప్రవీణ్ కుమార్, నాజర్ అహ్మద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.