మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండల కేంద్రంలో సుమారు 15 కిలోమీటర్ల దూరంలో వీరభద్రారం ఊరు నుండి మూడు కిలోమీటర్లు అడవి మార్గంలో,లోనికి వెళితే నయాగారా జలపాతాన్ని సైతం మరిపించే అంత అందమైన ముత్యాల ధార జలపాతం మనకు దర్శనమిస్తుంది. ఇటీవల కాలంలోములుగు జిల్లాలో ఎక్కడ చూసినా జలపాతాలు కనువిందు చేస్తున్నాయి . ఈ దట్టమైన అడవి ప్రాంతంలో గల ఈ ముత్యాల ధార 100 అడుగుల పైనుంచిపాల నురగలు కక్కుతూ అర కిలోమీటర్ వెడల్పుతో గలగల పారుతు జల సవడులు చేస్తూ పర్యాటకులని మరింత ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి తన అందాలతో పర్యాటకుల్ని కట్టిపడేస్తున్నాయి. ఈ జలపాతానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ. మంచి అనుభూతిని పొందుతున్నట్టు పర్యాటకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు రోజు వందల సంఖ్యలో పర్యాటకులు వస్తూ పోతున్న తరుణంలో వారి యోగక్షేమాలను వారు చేసే అసంఘిక కార్యకలాపాలపై సంబంధిత అధికారుల దృష్టి శూన్యంగా కనబడుతుంది. సంరక్షణ విషయంలో జలపాతం దగ్గర అధికారులు లేకపోవడంతో ముత్యాల జలపాతం అంతా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది . జలపాతం వద్దకు వస్తున్న ప్రయాణికులు మద్యం విచ్చలవిడిగా తాగుతూ తాగిన సీసాలను జలపాతంలో పగలగొడుతున్నారు. అంతేకాకుండా చుట్టూ ఉన్న అడవిని అడ్డగా చేసుకొని అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగిస్తున్నారు. గతంలో మద్యం మత్తులో కొన్ని ప్రాణాలు పోయిన పరిస్థితులు ఉన్నప్పటికీని, ఫారెస్ట్ అధికారులు చోద్యం చూస్తూ ఉండటం గమనార్హం. సుదూర ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకులకు రక్షణ కరువైన ఛాయలు కనబడుతున్నాయి.
కొందరు యువకులు మద్యం తాగి నీళ్లలో దిగడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించే క్రమంలో , మద్యం సేవించి వారి ప్రాణాలకు వారే ముప్పు కొని తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ప్రమాదాలు కేవలం మద్యం తాగడం వల్ల అవుతున్నందున ఈ విషయమై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.