మన్యం న్యూస్,ఇల్లందు:
అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు సమాజంలోని సమస్యలను ఎత్తిచూపుతూ ప్రజలకు న్యాయం జరగటంలో ముఖ్యభూమిక పోషిస్తున్న విషయం విదితమే. నిత్యం ఎన్నో ప్రజాసమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కార దిశగా కృషిచేస్తున్న జర్నలిస్టులకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేర్చడానికి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పట్టువదలని ధీశాలిగా కృషిచేశారు. ఎండ, వాన, చలికాలాలను సైతం లెక్కచేయకుండా ప్రజాసమస్యలను తనకలంతో వార్తకు రూపం ఇచ్చి అటు ప్రజాప్రతినిధులకు, ఇటు ప్రభుత్వానికి చేరవేస్తున్న జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం నుండి తీపికబురు అందింది. జర్నలిస్టులకు సొంత ఇంటిజాగా గురించి ఎన్నోఏళ్లుగా ప్రచారం జరుగుతుంది తప్ప ఆచరణలో మాత్రం సాధ్యపడట్లేదు. ఇదే విషయాన్ని గమనించి నిత్యం ప్రజల శ్రేయస్సుకై కృషిచేస్తున్న జర్నలిస్టుల సమస్యను ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ జర్నలిస్టుల సంక్షేమం, జర్నలిస్టులు ఎదురుచూస్తున్న సొంతఇంటి స్థలాల గురించి సీఎం కేసీఆర్ కి వివరించటం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం కేసీఆర్ వెంటనే సిసిఎల్ కమిషనర్ మిట్టల్ కు ఆదేశాలు జారీచేశారు. తక్షణమే జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో తమసమస్య పరిష్కారానికై విశేష కృషిచేసి కలను సాకారం చేసిన ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్, సీఎం కేసీఆర్ లకు జర్నలిస్టులు అందరూ సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కృతజ్ఞతలు తెలిపారు. తమ ఎన్నోఏళ్ల నిరీక్షణ అయిన సొంతింటి స్థలాన్ని తమకు వచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకొని కృషిచేసిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ కు ఇల్లందు జర్నలిస్టులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.