మన్యం న్యూస్, దుమ్ముగూడెం జులై 25::
మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలో గల గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ అమ్మ తల్లి జాతర వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ప్రతిరూపాలైన భక్తురాళ్ళు పూనకాలతో ప్రత్యేకంగా నృత్యాలు చేశారు.వేపాకు రోబ్బలతో గద్దెలను ప్రత్యేకంగా అలంకరించారు.పసుపు, కుంకుమలతో అమ్మవార్లకు మంగళ స్నానాలను ఘనంగా నిర్వహించారు.సాయంత్రం నాలుగు గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ముత్యాలమ్మ వృక్షం వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించి భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుడ్ల శ్రీనివాస్ రెడ్డి,గుడ్ల తాతారావు,దల్లి హరిబాబు,రాజు, డింగి రాంబాబు,అప్పన్న,మద్ది రాము తదితరులు పాల్గొన్నారు.