మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 02, విద్యా రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవితి ప్రేమ కనబరుస్తుందని, విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ అన్నారు. బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 607 ఎంఈఓ పోస్టులకు గాను, కేవలం 17 మంది రెగ్యులర్ ఎంఈఓ లు ఉన్నారని, 33 డిఈఓ పోస్టులకు కేవలం ఏడుగురు మాత్రమే రెగ్యులర్గా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా నూతన భవనాల నిర్మాణం పూర్తి చేయకుండా విద్యార్థులను అనేక ఇబ్బందులు పెడుతుందన్నారు. మరో పక్క ప్రైవేట్ విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ, ప్రభుత్వ విద్యను దూరం చేసే పరిస్థితి కనబడుతుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థి సంఘాలను, మీడియాని రాకుండా చేయటం సిగ్గుచేటన్నారు. మధ్యాహ్న భోజనం, కార్మికుల బిల్లుల తక్షణమే చెల్లించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిద్దు, అనిల్ కుమార్, రాజేష్, నరసింహారావు, రాకేష్, రామ్ చరణ్, పాల్గొన్నారు.
