UPDATES  

 ఇల్లందులో యధేచ్చగా బెల్టు దందా

– ఫుల్ బాటిల్ పై రూ.120 నుంచి 200 రూపాయల వరకు అక్రమ వసూళ్లు
– మందుబాబుల బలహీనతే లక్ష్యంగా అధిక వసూళ్లతో మద్యం ప్రియుల జేబులకు చిల్లులు

మన్యం న్యూస్,ఇల్లందు:

ఇల్లందు నియోజకవర్గంలోని మండలాల్లోని పలుగ్రామాల్లో బెల్టుషాపుల దందా మూడుపువ్వులు ఆరుకాయలు అన్నచందాన సాగుతోంది. గ్రామాల్లోని బెల్టుషాపులలో మద్యం అమ్మకాలు జోరుగా, నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఇల్లందు పట్టణంలో ఏర్పాటుచేసిన అనధికారిక సిండికేట్ మద్యం దుకాణం నుంచి ఆటోల ద్వారా నిరోజకవర్గంలోని వివిధ గ్రామాలకు విచ్చలవిడిగా మద్యాన్ని సరఫరా చేస్తూ వ్యాపారులు జేబులు నింపుకుంటు లక్షలకు పడగలెత్తుతున్నారనే ఆరోపణలు కోకొల్లలు. గ్రామాల్లో విక్రయించే మద్యం క్వార్టర్ బాటిల్ పై 30 నుంచి 50 రూపాయల వరకు అంటే ఈ లెక్కన ఫుల్ బాటిల్ పై 120 నుండి 200 రూపాయల వరకు అధికంగా అక్రమవసూళ్లు చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడ్తున్నారు. ఈ అధికధరలకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతూ భౌతికదాడులకు సైతం పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గ్రామాల్లో పీసాచట్టం నిబంధనలను సైతం లెక్కచేయకుండా ఎక్సైజ్ అధికారులనే తమ చెప్పుచేతల్లో ఉండేలా చూసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణ మూలంగా అనేక కుటుంబాలు రోడ్డున పడ్తున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే ఇల్లందు నుంచి ఆటోల ద్వారా అడ్డుఅదుపు లేకుండా మద్యం సరఫరా జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గ్రామప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో పడి బెల్టుషాపుల నిర్వహణపై దృష్టి సారించడంలేదని, తమకు సమయానికి మామూళ్లు ముడుతున్నాయని ప్రజలు ఏమైపోతే మాకేంటి అనేవిధంగా ఎక్సైజ్ అధికారుల తీరు ఉందని, ఇది సరైన పద్దతి కాదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్ని కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన చెందుతున్నారు. గ్రామాల్లో బెల్టుషాపుల కారణంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయా గ్రామాల మద్యం బాధిత కుటుంబాల మహిళలు పేర్కొంటున్నారు. ఇకనైనా గ్రామాల్లో బెల్టుషాపులకు స్వస్తి పలకాలని, లేనిపక్షంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ముట్టిడిస్తామని వారు హెచ్చరించారు. మందుబాబుల బలహీనతే ప్రధాన అజెండాగా అడ్డూఅదుపు లేకుండా నిరాటంకంగా సాగుతున్న బెల్టుషాపుల వల్ల ఇప్పటికే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సతమతమవుతున్నాయి ఇప్పటికైనా సదరు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తారో లేదో వేచిచూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !