- పొడుస్తున్న పొద్దు అస్తమయం
- పాటల పెద్దన్న గద్దర్ ఇక లేరు
- ఏడుదశాబ్దాల ఉద్యమ చైతన్యం గద్దర
- ప్రజా గాయకుడు గద్దర్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి
(మన్యంన్యూస్, హైదరాబాద్)
ప్రజల పాటకు శాశ్వత చిరునామా అతడే. గద్దరంటే ఒక చరిత్ర! గద్దరంటే ఒక ప్రభంజనం! గద్దరంటే నిలువెత్తు ఉద్యమపాట! గద్దరంటే పాటల భూకంపం! గద్దరంటే ఏడు దశాబ్దాల ఉద్యమ చైతన్యం! అలాంటి పాటల మహావృక్షం నేలకొరిగింది! ప్రజా ఉద్యమాల సాంస్కృతిక చరిత్రలో ఒక శకం ముగిసింది. కోట్లాదిమందిని కదిలించిన ఆ కంఠం మూగబోయింది. అనేక ఉద్యమాలను వెలిగించిన అతని ప్రదర్శన కళ ఆగిపోయింది. పాట ఇప్పుడు దిక్కులేనిది అయ్యింది. వేలాదిమంది కళాకారుల గుండె తల్లడిల్లుతోంది. అతడు పాటల పెద్దన్న. పాటంటే గద్దర్.. గద్దర్ అంటే పాట. గద్దర్, పాట రెండూ పర్యాయ పదాలు. అలాంటి పాటల గర్జన ఆగిపోయింది. ప్రజా గాయకుడు గద్దర్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి , ప్రభుత్వవిప్ రేగా కాంతారావు తదితరులు గద్దర్ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జన గాయకుడు, ప్రజా ఉద్యమకారుడు గద్దర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాట ద్వారా పల్లెపల్లెనా భావజాల వ్యాప్తి చేశారని కొనియాడారు. గద్దర్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నీపాదం మీద పుట్టుమచ్చనై..
గద్దర్ రాసిన అనేక పాటలు ఆయన పాడితే తప్ప ఆయన రాసినవనే విషయం గుర్తు పట్టలేము. అలాగే ఇతరులు రాసిన పాటలను కూడా గద్దర్ తన గొంతులో అద్భుతంగా పలికించేవాడు. అయినప్పటికీ కొన్ని పాటలు గద్దర్ మార్క్ పాటలుగా నిలిచాయి. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో’ పాటలో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అద్భుతంగా వర్ణిస్తూనే ఆడపిల్లలకు ఎన్ని ఆంక్షలుంటాయో కళ్లకు కట్టాడు గద్దర్. రాజ్యహింస పెట్రేగిపోయినప్పుడు గద్దర్ గళం, కలం నిశ్శబ్దంగా ఉండేవి కావు. పాటకట్టి పాలకులను ప్రశ్నించేవి. పారుతున్న నెత్తురును పాట కట్టి ప్రజల ముందు నిలిపేవి. అట్లా రాజ్యహింస పెరిగినప్పుడు గద్దర్ రాసిన పాటలు వేలాదిమందిని ఆలోచింపజేశాయి. ఇటీవల బహుజన ధూంధాం వేదికల మీద ‘‘బానిసలారా లెండిరా.. ఈ బాంచన్ బతుకులు వద్దురా’’ అంటూ గళమెత్తాడు.
పొడుస్తున్న పొద్దు మీద నడిచొచ్చిన పాట
తెలంగాణ నేల మీద అనేక ఉద్యమాలు తమ చరిత్రను నెలకొల్పాయి. ఆ ఉద్యమాలకు పాటల ఊపిరిని అందించింది గద్దర్ కలం, గళం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ తక్కువ పాటలే రాసినా అవి జనం నోళ్లల్లో నానాయి. అందులో ‘జైబోలో తెలంగాణ’ సినిమాలో వచ్చిన ‘‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’’ పాట ప్రత్యేకమైంది. మలిదశ ఉద్యమకాలాన్ని వెలిగించిన పిడికెడు పాటల్లో ఇది కూడా ఒక్కటి. గద్దర్ మార్క్ పాట. దీనికి సినిమాలో గద్దరే అభినయం చేయడం మరో చరిత్ర. ఈ పాటలో గద్దర్ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘‘మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా.. తిరగబడ్డ రాగమా’’ అంటాడు. తెలంగాణ సహజవనరులను దోచుకుంటున్న పెట్టుబడిదారుల గుండెల్లో ఫిరంగై పేలింది ఈ పాట.