మన్యంన్యూస్,ఇల్లందు:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలల్లోనే జరగునున్న విషయం విదితమే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇల్లందు నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకీ మరింతగా వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో అతిత్వరలో వెలువడపోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించుకునేందుకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ప్రచార రథం ఎన్నికల సమరానికి సిద్ధమైంది. ఈ మేరకు ఆదివారంనాడు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ప్రచారరథానికి ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, టేకులపల్లి మండల అధ్యక్షులు బొమ్మెర వరప్రసాద్, కౌన్సిలర్లు జేకే శ్రీను, కొక్కునాగేశ్వరావు, బయ్యారం మండల అధ్యక్షులు తాత గణేష్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
