ఇల్లందు పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
సమస్య తక్షణ పరిష్కారమే ధ్యేయంగా వార్డుల పర్యటన:మున్సిపల్ ఛైర్మెన్ డీవీ
మన్యం న్యూస్,ఇల్లందు:అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ, కరోన టైంలోనూ ప్రజలను చైతన్య పరుస్తూ వారిలో దృడ సంకల్పాన్ని నింపుతూ మున్సిపల్ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావు ముందుకు సాగిన సంగతి విధితమే. కుటుంబసభ్యులే దగ్గరకు రానటువంటి కరోనా పరిస్థితుల్లో మరణించిన వారి అంతక్రియలు నిర్వహించి ఇల్లందు పట్టణ ప్రజల అభిమానాన్ని చూరగొని పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించి రాష్ట్ర మరియు జాతీయ స్ధాయిలో గుర్తింపు పొంది అవార్డులు అందుకునేల చేసి అభివృద్దికి తార్కాణంగా డీవీ నిలిచిన విషయం విదితమే. తాజాగా ప్రస్తుత పాలకవర్గం మరో ముందడుగు వేస్తూ నూతన కార్యక్రమానికి కార్యరూపం దాల్చారు. ఈ సందర్భంగా విలేకరులతో డీవీ మాట్లాడుతూ.. సోమవారం నుంచి 24 వార్డులలో పర్యటించి ప్రతివార్డుకు రెండురోజులు కేటాయించి అధికారులు, సిబ్బంది అంతా ఒక్కదగ్గర ఉండి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించామని ఆయన తెలిపారు. సోమవారం నుంచి దాదాపు 50 రోజులపాటు పట్టణంలోని 24 వార్డులలో పర్యటించి పట్టణంలో ఉన్న ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కౌన్సిలర్లు, శానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా చేపట్టిన ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఛైర్మెన్ డీవీ కోరారు. పట్టణ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు లేని మున్సిపాలిటీగా ఇల్లందును తయారుచేయడమే తమ పాలకవర్గ ధ్యేయంగా మున్సిపల్ ఛైర్మెన్ డీవీ అభిప్రాయపడ్డారు.