అండర్.. పరేషాన్
కొత్తగూడెం నడిబొడ్డులో.. డేంజర్
రైల్వే అండర్ బ్రిడ్జి మధ్యలో గుంట
డ్రైనేజీలో నిల్వ ఉన్న మురికి నీటితో దుర్వాసన
పేరుకుపోయిన ఇసుక మేటలు
వాహనాలు జారితే ప్రాణాలు గాలిలోకి
ప్రమాదం పొంచి ఉన్న పట్టనట్లుగా అధికారులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జి మధ్యలో ప్రమాదం పొంచి ఉంది. సమీపంలో ఉన్న కిన్నెరసాని ప్రధాన పైప్లైన్ నుండి లీకు అవుతున్న కిన్నెరసాని జలాలు వచ్చి అండర్ బ్రిడ్జి మధ్యలో నిల్వ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో పెద్ద గుంట ఏర్పడింది. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాల వల్ల అండర్ బ్రిడ్జికి అటు ఇటు ఇసుక మేటలు ఏర్పడ్డాయి. పక్కనే పొడవుతా డ్రైనేజీ ఉండగా అందులో భారీగా సిల్ట్ పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. కుప్పలుగా ఏర్పడిన ఇసుకమేటల వద్ద జాగ్రత్తగా ఉండకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కింద పడిపోయి ప్రాణాలు పోవడం గ్యారెంటీ అని కొంత మంది వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అండర్ బ్రిడ్జి వద్ద అస్తవ్యస్తంగా మురికి నీరు ఇసుక కుప్పలు ఉన్నప్పటికీ మున్సిపాలిటీ వారు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ వారు స్పందించి అండర్ బిసి వద్ద క్లీన్ అండ్ గ్రీన్ పనులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కొత్తగూడెం పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.