వైన్ షాప్ టెండర్లకు 15 రోజులు
, గృహలక్ష్మి దరఖాస్తుకు 3 రోజులేనా
మండిపడ్డ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆదివాసీ దినోత్సవానికి హాజరు
మన్యం న్యూస్, ఇల్లందు రూరల్:
ఇల్లందు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాణిక్యారం లో పొలంలో నాటు వేస్తున్న కూలీలతో కలిసి కొంతసేపు నాటు వేశారు. కోమరారం, మానిక్యారం పంచాయితీలోని పలు గ్రామాల నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి బారిగా చెరికలు జరిగాయి, దాదాపు 1500 మందిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోరం కనకయ్య ప్రసంగిస్తూ.. మోసపూరిత హామీలతో రెండు పర్యాయాలు గద్దెనెక్కి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నటువంటి కల్వంట్ల కుటుంబాన్ని గద్దెదింపే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు.
బ్రతుకులు ఆగం చేసే వైన్ షాప్ ల టెండర్ల గడువుకు 15రోజులు ఇచ్చి, నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే గృహలక్ష్మి పథకం కొరకు కేవలం 3రోజులు మాత్రమే గడువు కేటాయించడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి అవినీతి, దోపిడీ, అక్రమకేసుల వల్ల విసిగివేసారి, రోజురోజుకూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఆధరాభిమానాలు పెరుగుతున్నాయన్నారు. ప్రజలు, మేధావుల సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలకమిటీ నాయకులు, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.