మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ ప్రాదేశిక కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు ఈనెల 17వ తేదీనుంచి ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24వార్డుల్లో ఎనిమిది రోజులపాటు చేపట్టనున్న గడప, గడపకు కాంగ్రెస్ పార్టీ పోస్టర్లను సోమవారం పట్టణంలో గల జెడ్పీచైర్మన్ క్యాంపు కార్యాలయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ఆవిష్కరించారు. అనంతరం హాజరైన పట్టణ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కనకయ్య మాట్లాడుతూ.. రానున్నరోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐదులక్షల రూపాయలతో ఉచిత వైద్యం, ఆడబిడ్డలకు ఐదువందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, పేదవారి సొంతింటి కల సాకారానికి ఐదులక్షల రూపాయలు ఆర్థికసాయం, ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ ఐదువేల రూపాయలు, రైతులకు రెండులక్షల రూపాయల రుణమాఫీ, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్, డయాలసిస్, పైలేరియా భాదితులకు నెలకు నాలుగువేల రూపాయల పించన్ తదితర అంశాలపై గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరం సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని 24వార్డుల ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.