రూ.3వేల కోట్ల పై చిలుకు నిధులతో కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి
*మోడల్ నియోజకవర్గంగా కొత్తగూడెం
* 115 కోట్లతో టౌన్ లో అభివృద్ధి
* 96 కోట్లతో మండలాలలో రోడ్లు డ్రైనేజీలు
* 12 కోట్లతో ట్యాంక్ బండ్ నిర్మాణం
* 135 కోట్లతో కిన్నెరసాని కొత్త పైప్ లైన్ నిర్మాణం
* పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను
స్పీడ్ అప్ చేయాలని ఆదేశం
* నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వనమా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:రూ.3వేల కోట్ల పై చిలుకు నిధులతో కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని,
కొత్తగూడెంను మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశంలో వనమా వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. 115 కోట్ల రూపాయలతో కొత్తగూడెం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. 220 పనులు గురువారం నుండి మొదలవుతాయని తెలిపారు. 96 కోట్ల రూపాయలతో సుజాతనగర్, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో రోడ్లు డ్రైనేజీలు ఇతర అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. 12 కోట్ల రూపాయలతో పాత పాల్వంచలోని చింతలచెరువు వద్ద ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. 135 కోట్ల రూపాయలతో కిన్నెరసాని కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 100 కోట్లతో పాల్వంచ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని తాజాగా విడుదలైన నిధులతో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికను రూపొందించుకున్నట్లు తెలిపారు. ముర్రేడు వాగు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పెనుబల్లి వాగుపై బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పెద్దమ్మ గుడి వద్ద రెండు కళ్యాణ మండపాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిని త్వరలో ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. గృహలక్ష్మి పథకం కింద 3000 మంది లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ముస్లిం మైనార్టీలకు సైతం రుణాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కొత్తగూడెం పాల్వంచలో సెంట్రల్ లైటింగ్ లో ఏర్పాటు చేశామని ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కొత్తగూడెం పాల్వంచ ఇతర మండలాల అభివృద్ధికి నిధులు కావాలని ఇటీవల సీఎం కేసీఆర్ ను స్వయంగా కలవడంతో ఆయన అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారని తెలిపారు. కెసిఆర్ ఆశీస్సులతో కొత్తగూడెం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, ఎంపీపీలు బాదావత్ శాంతి, సోనా ఇతర డిపార్ట్మెంటులకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వివిధ శాఖల పనితీరుపై ఎమ్మెల్యే అసహనం..
కొత్తగూడెం క్లబ్లో బుధవారం జరిగిన నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై కొత్తగూడెం ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయడంలో కొంతమంది అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తగా మొదలయ్యే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వనమా అధికారులకు విజ్ఞప్తి చేశారు.