ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.
*ప్రతి ఆటోడ్రైవర్ సరియైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి
*లేనియెడల కఠిన చర్యలు
*భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్
మన్యం న్యూస్ బూర్గంపహాడ్ (భద్రాచలం): ఆటో డ్రైవర్లు తమ ఆటోలను నడిపే సమయంలో తప్పకుండా నిబంధనలు పాటించి ప్రజల మన్ననలు పొందాలని భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు.భద్రాచలం పట్టణం లోని ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 15 యూనియన్లకు సంబంధించిన 90 మంది ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు.తమ వెనక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలనీ సూచించారు.రాత్రిపగలు ప్రజలకు సేవలు అందిస్తున్న ఆటో డ్రైవర్లు అభినందనీయులన్నారు.భద్రాచలం పట్టణం లో భారీ వాహనాలరవాణాపెరిగినందున రోడ్లపై ఆటోలను ఇష్టారాజ్యంగా నిలపకూడదని,ఒకవేళ అలా నిలిపివేస్తే జరిమానాలతో పాటు చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ,అదే విధంగా ఆటో డ్రైవర్లు అందరూ ప్రయాణీకులతో మర్యాదగా వ్యవహరించి,వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని పేర్కొన్నారు.ఆటోలలో ప్రయాణించే ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా కేసు నమోదు చేస్తామని తెలిపారు.నిర్ధేశించిన ధరలకే ప్రయాణీకుల వద్ద నుంచి ఛార్జీలు వసూలు చేయాలని ఆయన కోరారు.ఆటోలలో ఉన్న సౌండ్ బాక్సులు తొలగించాలని,డ్రైవర్లు యూనిఫారం తప్పక ధరించాలని అన్నారు.ఆటోని నడుపుతున్న ప్రతి డ్రైవర్ కి లైసెన్స్,సంబంధిత ఆటో కి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని,ప్రతి ఆటోకి టాప్ నెంబర్,రిజిస్ర్టేషన్ నెంబర్ కనబడేలా ఉండాలని,అదే విధంగా అన్ని రకాల అనుమతి పత్రాలు కలిగి,మద్యం సేవించి ఆటోలు నడప కూడదని ట్రాఫిక్ ఎస్ ఐ శ్రీనివాస్ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పట్టణం లో గల ఆటో యూనియన్ల నాయకులు,సభ్యులు,ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.