మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 20: మండలంలోని తిరుమలకుంట గ్రామంలో కోయగూడెం వాస్తవ్యులు ఆదివారం శ్రావణ బాణాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామంలోని గ్రామదేవత ముత్యాలమ్మ తల్లికి మహిళలు నీళ్లు పోసి, అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి బోనాలు ప్రారంభించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఇష్టమైన గారెలు, అప్పాలు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యువతులు, మహిళలు గ్రామంలో ఊరేగింపుగా నూతన దుస్తులను ధరించి తమ సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా భక్తిశ్రద్ధలతో నైవేద్యం బోనం కుండలతో ఊరేగింపు నిర్వహించి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.మహిళలు పెద్ద సంఖ్యలో బోనం కుండలతో ఊరేగింపు నిర్వహించి పలువురిని ఆకట్టుకున్నారు. మేళతాళాలు, డప్పు నృత్యాలు మధ్య మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో గ్రామంలో తిరిగి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. బోనాల వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బోనాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరం కావున ప్రతి సంవత్సరం గ్రామంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నట్లు మహిళలు తెలియజేసారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నారం పోతయ్య, తాటి నాగేష్, పొట్టా నాగబాబు, కొర్సా రాజేష్, మొడియం వీరేశ్వరరావు, సిఎచ్ పద్మ, సిఎచ్ శ్యామల, మోడియం అక్కమ్మ, మడకం పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
