సింగరేణి అభివృద్ధికి మీడియా సహకారం ప్రశంసనీయం
* సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎన్.బలరాం
* నిజ నిర్ధారణ చేసుకొని వార్తలు రాయడం అవసరం
* జిల్లా డీఆర్ఓ రవీంద్రనాథ్
* కొత్తగూడెలో పాత్రికేయుల కోసం పిఐబి ఆధ్వర్యంలో “వార్త లాప్ వర్క్ షాప్”
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
సింగరేణి అభివృద్ధికి మీడియా సహకారం ప్రశంసనీయమని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎన్.బలరాం అన్నారు. అంతేకాకుండా పాత్రికేయ మిత్రులు భారత ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ముఖ్యపాత్ర పోషించడం అభినందనీయమన్నారు. అలాగే పట్టణ గ్రామీణ పాత్రికేయుల్లో వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా నిపుణులతో ప్రత్యేక వర్కుషాప్ లను నిర్వహిస్తూ పలు అంశాల పైన అవగాహన కలిగిస్తున్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఇల్లందు గెస్ట్ హౌస్ లో జరిగిన “వార్తలాప్ – ఒక రోజు వర్క్ షాప్”కి ముఖ్యఅతిథిగా సింగరేణి డైరెక్టర్ బలరాం హాజరై మాట్లాడారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు సింగరేణి ప్రాంత విలేకరుల కోసం ప్రత్యేక ఆసక్తితో ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలపగానే మా వంతుగా మేము సహకారాన్ని అందించామని తెలిపారు. ఎంతో పని ఒత్తిడితో బిజీగా ఉన్నప్పటికీ ఇటువంటి సమావేశాల్లో పాల్గొంటున్న మా సోదర పాత్రికేయులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
మీడియా మిత్రుల సేవలు మరువలేనివి: డిఆర్ఓ రవీంద్రనాథ్
ప్రభుత్వాలకు అధికారులకు మీడియాకు మధ్య వారధిలా పని చేస్తున్న మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువేనని డీఆర్ఓ
రవీంద్రనాథ్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో నిజ నిర్ధారణ చేసుకొని వార్తలు రాయడం అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం పి ఐ బి జాయింట్ డైరెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని పత్రికా సమాచార కార్యాలయం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తోందని పేర్కొన్నారు. మీడియాలో విలువలు అభివృద్ధి జర్నలిజం అంశాలపై ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. సైబర్ యుగంలో మనం డేటాను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని గురించి మరో వక్త సి డాక్ సైంటిస్ట్ జగదీప్ బాబు మాట్లాడడం జరిగింది. పిఐబి పనితీరుని పి.పి.టి ప్రెజెంటేషన్ ద్వారా డిప్యూటీ డైరెక్టర్ మనస్ కృష్ణ కాంత్ వివరణాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కు చెందిన సిబిసి అధికారి కోటేశ్వర రావు, పి ఐ బి అధికారి శివ చరణ్ రెడ్డితో పాటు పిఐబి అధికారులు కూడా పాల్గొన్నారు.