UPDATES  

 తెలంగాణ సంపద ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరం

తెలంగాణ సంపద ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరం
* సింగరేణి కాలరీస్ కంపెనీ దివాలా
* కెసిఆర్ పాలన అవినీతిమయం
* బిజెపి బలం పెరుగుతుంది
* అమిత్ షా సభను జయప్రదం చేయండి
* ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ సంపద ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరం అవుతుందని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటెల మాట్లాడారు. కెసిఆర్ పాలన అధ్వానంగా మారడంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతుందని ఫలితంగా కాంట్రాక్టర్లు తెలంగాణ సంపాదన ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. కెసిఆర్ పాలనలో సింగరేణి సంస్థ దివాలా తీసిందన్నారు. సింగరేణి సంపదను ఇతర పనులకు కేసీఆర్ వాడుకుంటున్నాడని విచారణ వ్యక్తం చేశారు. ఒకప్పుడు సింగరేణిలో ఒక లక్ష 60 వేల మంది ఉద్యోగులు ఉంటే తెలంగాణ వచ్చే సరికి 62 వేల మంది కావడం జరిగిందన్నారు. ఈ పదేళ్లలో 43 వేల మందికి తగ్గించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఒకప్పుడు సింగరేణిలో మట్టి తీసే కాంట్రాక్ట్ మాత్రమే ప్రైవేట్ వారికి ఇచ్చేవారని ఇప్పుడు బొగ్గు కాంట్రాక్ట్ కూడా ప్రైవేట్ వారికి ఇవ్వడం దారుణమన్నారు. దశలవారీగా సింగరేణి కంపెనీని కెసిఆర్ బ్రష్టు పట్టిస్తున్నాడని మండిపడ్డారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను ప్రైవేటుపరం చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలం పెరుగుతుందని అన్నారు. బీజేపీనీ ఆశీర్వదిస్తే కేంద్రం అండదండలతో సింగరేణికి ఆనాటి వైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆదివారం ఖమ్మం లో జరిగే బిజెపి సభను బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, ములుగు బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, నాయకులు లక్ష్మణ్ అగర్వాల్, నాగేశ్వరరావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !