మన్యం న్యూస్ గుండాల: ట్రాఫిక్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని గుండాల సీఐ రవీందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెంట్ తప్పనిసరిగా ధరించాలంటూ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించడం వలన ప్రమాదం కి గురైతే సురక్షితంగా ప్రాణాపాయం నుండి బయటపడచ్చని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రయాణించిన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీల్స్ వాహనాలు నిర్లక్ష్యంగా మద్యం సేవించి నడపడం ద్వారా తమతోపాటు ఎదుటి వారికి సైతం ప్రమాదాలు పొంచి ఉంటాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రయాణించడం ద్వారా ప్రతి సంవత్సరం వేలమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. గతంలో కంటే ఇప్పుడు చలానాలు సైతం భారీ స్థాయిలో వేయడం జరుగుతుందని 18 సంవత్సరాలు నిండినవారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలకు వాహనం ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయబడుతుందని ఆయన పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
