కాంట్రాక్టు కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ షావలి
మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందులో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్రసదస్సు ఈనెల 10వ తారీఖున జరగనున్న సందర్భంగా రాష్ట్రసదస్సును జయప్రదం చేయాలని కోరుతూ 24 సివిక్, సివిల్ కార్మికుల మాస్టర్ అడ్డాల వద్ద జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ..బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న ముప్పైవేల మంది కాంట్రాక్టు కార్మికుల జీతాలు 2017నుండి పెరగలేదన్నారు. బొగ్గు పరిశ్రమల్లో వందలకోట్ల లాభాలు వస్తున్నా కాంట్రాక్టు కార్మికులకు మాత్రం తక్కువవేతనాలు ఇవ్వడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేలకోట్ల లాభాలకు కారకులైన కాంట్రాక్టు కార్మికులకు పచ్చడి మెతుకులు కూడా దొరకడం లేదని ఆవేదన వెళ్లగక్కారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి బొగ్గు పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మిక చట్టాలున్నా అమలుకు నోచుకోవడం లేదనీ,
సుప్రీంకోర్టు 2016లో సమానపనికి సమానవేతనం ఇవ్వాలని తీర్పునిచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇల్లందులో నాలుగు సంవత్సరాల నుండి కాంట్రాక్టు కార్మికుల సీఎంపిఎఫ్ లెక్కలు చూపడంలేదని కనీసం జీతంలో కట్ చేస్తున్న చిట్టీలు కూడా ఇవ్వట్లేదన్నారు. వెంటనే సీఎంపిఎఫ్, సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10వ తారీఖున ఇల్లందులో చండ్రకృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ భవనంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సుకు సింగరేణివ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా యాకూబ్ షావలి పిలుపునిచ్చారు.





