మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి
నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు నిషిత పరిశీలన చేయాలని, ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు కొన్ని ఇలా ఉన్నాయి. మణుగూరు మండలం బండారుగూడెం ఆదర్శనగర్‌కు చెందిన చల్లా నర్సయ్య తన ఇంటిస్థలాన్ని కొందరు కబ్జా చేసి వృద్ధుడైన తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అలాంటి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని చేసిన ఫిర్యాదును
పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం మణుగూరు తహసిల్దార్‌కు ఎండార్స్ చేశారు.
ముల్కలపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన కారం దావీద్ రామచంద్రాపురం నందు
రెండు వాటర్ ట్యాంకులు ఉన్నా తాగునీటి సౌకర్యం ఆగమ్యగోచరంగా ఉందని వర్షాలు వచ్చినపుడు వస్తాయని మామూలు టైంలో రావట్లేదని డ్రైనేజి వ్యవస్థ గురించి పట్టించుకోవడం లేదని బ్లీచింగ్ కూడా చల్లడం లేదని పేర్కొంటూ చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం జిల్లా పంచాయతీ అధికారికి ఎండార్స్
చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు
పాల్గొన్నారు.