మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఆల్ కేడర్ ఉద్యోగస్తులు తమ సమస్యలపై మంగళవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు ఎమ్మెల్యేకు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. గత 20 ఏళ్లుగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా స్టాప్ నర్సులు ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్ పి.హెచ్.యంలు అకౌంటెంట్ కామ్ డి.ఈ.ఓలు పి.హెచ్.సి డిఈఓలు కంటినిజెంట్ వర్కర్స్ తదితర ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కాకుండా అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు నిత్యావసర వస్తువులు పెరిగి నేపథ్యంలో 10 వేల రూపాయల నుంచి కేవలం 25 వేల రూపాయలు వివిధ క్యాడర్లో వేతనాలు ఇస్తున్నందున బ్రతకటం కష్టతరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలు, పీజీలు చేసి, వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని పర్మినెంట్ ఉద్యోగులుగా ఉండాల్సినటువంటి తాము అనేక ఏళ్లుగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయటం వల్ల వయసు మీద పడి కుటుంబాన్ని బతికించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో, ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే విధంగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వ భద్రతతో గూడిన ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నారాటి ప్రసాద్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకి తెలియజేయడం జరిగింది. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ కు మంత్రి హరీష్ రావుకు సమస్యలను తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, శారద, సింధు, ద్వారకానాథ్, వీరన్న, సుశీల,పార్వతి, రాధిక, మేరీ, రాములమ్మ, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.