బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎవరు?
* భద్రాద్రి జిల్లా కేంద్రంలో చర్చ
* నలుగురు పోటీపడుతున్నట్లు ప్రచారం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీకి గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షుడు హోదాలో కొనసాగిన కోనేరు సత్యనారాయణ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసింది. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇప్పటివరకు భద్రాద్రి జిల్లాకు బిజెపి అధ్యక్షుడిగా ఎవరిని నియమించకపోవడం పట్ల చర్చనీయాంశంగా మారింది. బిజెపి అధ్యక్ష పదవికి కె.వి.రంగా కిరణ్, ఎడ్లపల్లి శ్రీనివాస్, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు భద్రాచలం ప్రాంతానికి చెందిన ఒకరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా బిజెపి అధ్యక్షునిగా నియమించడానికి మరో రెండు వారాలు సమయం పట్టనున్నదని కొంతమంది బిజెపి శ్రేణులు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. గత నెలలో ఖమ్మం జిల్లాలో బిజెపి అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ జరిగింది. ఈ సభకు హాజరయ్యేందుకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చి స్థానిక బిజెపి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికే బిజెపి జిల్లా అధ్యక్షుడి హోదా ఖాళీగా ఉంది. ఆగస్టు నెల ముగిసి సెప్టెంబర్ వచ్చి రోజులు గడిచిపోతున్న ఇంకా బిజెపికి అధ్యక్షుడిగా ఎవరిని నియమించకపోవడంతో భద్రాద్రి జిల్లా కేంద్రంలో తీవ్ర చర్చకు దారి దారితీస్తుంది. ఏది ఏమైనప్పటికీ బిజెపికి అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెడతారనేది బిజెపి అభిమానులు ఎదురు చూడక తప్పడం లేదు.