* ఎంతమంది ఉసురు పోసుకొని పాలన సాగిస్తారు
* బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: చాలీచాలని జీతాలతో జీవితాలను వెల్లదీస్తున్న హోంగార్డులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్లే హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు. గురువారం బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017 సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా హోంగార్డులందరినీ పర్మినెంట్ చేస్తానని హోంగార్డులకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భీమా లాంటి సౌకర్యాలు కల్పించి కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేసారని ఆరోపించారు. ఆరు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ ఆ హామీ నీటి మీద రాతలా నిలిచిపోయిందని హోంగార్డ్ లతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ వారికి సకాలంలో జీతాలు సైతం చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వహించి రిటర్మెంట్ తీసుకున్న తర్వాత వారికి భరోసా కల్పించేందుకు ఏ విధమైన బెనిఫిట్స్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డులో ఆత్మహత్యాయత్నం ఘటన జరిగినప్పటికీ ముఖ్యమంత్రికి, హోం మంత్రికి వెళ్లి పరామర్శించే తీరిక లేకపోవడం బాధాకరమన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో హోంగార్డులు అహోరాత్రులు శ్రమిస్తున్నారని కొనియాడారు. వారిపట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరం లేదని తమ న్యాయమైన డిమాండ్ల కోసం హోంగార్డులు సైతం రోడ్లపైకి వచ్చే పరిస్థితిని బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ కల్పించారని అన్నారు. హోంగార్డ్ రవీందర్ కు ఏదైనా జరగకూడనిది జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు, సాయి, పట్టణ అధ్యక్షుడు వంగా రవిశంకర్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.