మన్యం న్యూస్,ఇల్లందు: ఆంధ్రాలో అరాచక, విధ్వంసకర పాలన సాగిస్తున్న సైకో జగన్ రెడ్డి తనగొయ్యి తానే తవ్వుకున్నాడని, పోయేకాలం దాపరించి ఇలాంటి ఉన్మాదచర్యలకు పాల్పడుతున్నాడని తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్రఉపాధ్యక్షులు చాందావత్ రమేష్ బాబులు ఘాటుగా విమర్శించారు. నంద్యాలలో శనివారం తెల్లవారుజామున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును అక్రమంగా, అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసినతీరుకు నిరసనగా తెలుగుదేశం శ్రేణులు పట్టణంలోని బుగ్గవాగు బ్రిడ్జిదగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడ వంశీ మాట్లాడుతూ..ప్రజాస్వామ్య వాదులందరూ ఈ దుర్మార్గపు చర్యను ఖండించాలని కోరారు. లక్షకోట్ల ప్రజాధనం అవినీతికేసులో పదహారు నెలలు జైల్లో చిప్పకూడుతిన్న జగన్ రెడ్డి నేడు అధికార మదంతో రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడని, ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరులేకపోయినా భయానక వాతావరణం సృష్టించి తెలుగుదేశం నాయకులను హౌస్ అరెస్ట్లు చేసి, నియంతలాగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేలమంది పోలీసులను మోహరించి దుర్మార్గంగా చంద్రబాబుని అరెస్ట్ చేసారని విమర్శించారు. ఇందుకు సంబంధించి రానున్నకాలంలో జగన్ రెడ్డి తగినమూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు శ్యామ్ తీవారి, కారు నర్సన్న, అయ్యోరి నాగరాజు, కంది రవి, నూక వెంకటేశ్వర్లు, గుళ్లోల మొగిలి, శ్రీహరి, సుదర్శన్, సంజయ్, వినీత్ తదితరులు పాల్గొన్నారు.