మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ దేవరపల్లి కీర్తి చంద్రికరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ..లోక్ అదాలత్ అంటే ప్రజాకోర్టు అని, కోర్టులో ట్రయల్ నడిచి తీర్పు వచ్చినట్లయితే ఒకరికి నష్టం ఇంకొకరికి లాభం జరుగుతుందని అన్నారు. లోక్ అదాలత్లో క్షణికావేశంలో పెట్టుకున్న రాజీపడదగిన కేసులు ఇరువర్గాలు రాజీ చేసుకున్నట్లయితే తమ విలువైన కాలాన్ని, డబ్బుని వృధాకాకుండా ఈ జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని కాబట్టి కక్షిదారులు ఈ లోక్ అదాలత్ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఇరువర్గాలు ఆయా ఊర్లలో రచ్చబండ ఏర్పాటుచేసుకొని పెద్దమనుషుల ద్వారాగాని, సంఘం పెద్దమనుషుల ద్వారాగాని రాజీ పడడం వల్ల అట్టికేసులకు చట్టబద్ధత ఉండదని, ఇరువర్గాలు కోర్టుకు వచ్చి లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకున్నట్లయితే చట్టబద్ధత ఉండటంతో ఇరువర్గాలు గెలిచినట్లేనని కీర్తి చంద్రికరెడ్డి పేర్కొన్నారు. ఒకసారి లోక్ అదాలత్లో రాజీ పడినట్లయితే పైకోర్టులకు వెళ్లి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ మెంబర్ దంతాల ఆనంద్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిడి సత్యప్రకాష్, జనరల్ సెక్రెటరీ సువర్ణపాక సత్యనారాయణ దొర, వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ నాయక్, జాయింట్ సెక్రెటరీ కీర్తికార్తీక్, ట్రెజరర్ ఉమామహేశ్వరరావు, ఏపీపీలు వేముల రచిత, కుంట శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు మల్లికార్జునరావు, పప్పుల గోపీనాథ్, తాడూరి మహేశ్వరరావు, కాసిం, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
