సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..
* నాయకులు సెక్యూరిటీ గార్డుల మధ్య తీవ్ర వాగ్వాదం
* సింగరేణి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది తీరుపై మండిపడ్డ ఏఐటీయూసీ నేతలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు సింగరేణిలో పనిచేస్తున్న మైనింగ్ స్టాప్ కు సరైన గౌరవం ఇవ్వాలని సదుపాయాలు కల్పించాలని కోరుతూ శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఏర్పాటుచేసిన దీక్ష శిబిరం టెంటును సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతేకాకుండా ఏఐటీయూసీ నాయకులపై సింగరేణి సెక్యూరిటీ గార్డుల దౌర్జన్యం చేయడంతో మరింత గందరగోళం నెలకొంది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో శాంతియుత వాతావరణం నెలకొంది.
కార్మికోద్యమాల విచ్చిన్నం చేసే చర్యలు మానుకోవాలి…
చట్టపరమైన హక్కులు అమలు చేయాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఉద్యమాలను, పోరాటాలను సింగరేణి యాజమాన్యం జీర్ణించుకోలేకపోతోందని ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే హక్కు సింగరేణి అధికారులకు ఎవరిచ్చారని సిపిఐ భద్రాది జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా ప్రశ్నించారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ మైనింగ్, టెక్నికల్ సబ్ కమిటీల ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్షల శిభిరం టెంటును తొలగించి దౌర్జన్యానికి పాల్పడిన సింగరేణి సెక్యూరిటీ గార్డులు వారికి ఆదేశాలు జారీచేసిన అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం నిరంకుశ వైఖరి అవలంభిస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, నూనావత్ గోవిందు, మాచర్ల శ్రీనివాస్, కిష్టోఫర్, జె.గట్టయ్య, కె.రాములు, కొచ్చెర్ల జోసఫ్, కె.సోమయ్య, తోట రాజు తదితరులు పాల్గొన్నారు.