మైనింగ్ టెక్నికల్ సిబ్బందితో ఊడిగం చేయించుకుంటారా..?
* శ్రమదోపడికి గురౌతున్న మైనింగ్ టెక్నికల్ సిబ్బంది
* సింగరేణి సంస్థలో ఫ్రంట్లైన్ సూపర్వైజర్లకు దక్కని గౌరవం
* కార్మికులు రోడ్డెక్కే పరిస్థితికి తీసుకురాకండి
* న్యాయమైన డిమాండ్ల పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె తప్పదు
* వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీతారామయ్య, రాజకుమార్
* సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దీక్ష
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో కీలక భూమిక పోషిస్తున్న మైనింగ్, టెక్నికల్ సిబ్బందిపట్ల సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, పేరుకే ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్లుగా పేర్కొంటున్నారేతప్ప తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్కుమార్ ఆరోపించారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ సింగరేణి మైనింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ సబ్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షల శిభిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. సంస్థకు ఎనలేని సేవలందించి పురోభివృద్ధికి తోడ్పాటును అందించి అనారోగ్య కారణాలతో మెడికల్ ఆన్ఫెట్ అయిన మైనింగ్, టెక్నికల్ సిబ్బందికి సరైన గౌరవం దక్కడం లేదన్నారు. హోదా తగ్గకుండా సర్ఫేస్ ఉద్యోగం కల్పించాల్సిన భాద్యత యాజమాన్యంపై ఉందని, సర్ఫేస్ సూటబుల్ జాబ్ ఇవ్వాలని ఏఐటియుసి గుర్తింపు సంఘంగా ఉన్న హయాంలో యాజమాన్యంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని ఈ అగ్రిమెంట్ను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం సరైనదికాదన్నారు. ఉత్పత్తి, లాభాల్లో కీలక పాత్రపోషిస్తున్న ఫ్రంట్ లైన్ సూపవైర్లకు సరైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తూ ఏండ్ల తరబడి పదోన్నతులు కల్పించకుండా శ్రమదోపిడికి పాల్పడుతున్నారన్నారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో అధికారులను కాపాడుతూ మైనింగ్, టెక్నికల్ సిబ్బందిపై క్రమశిక్షణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మైనింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ ఒప్పందాలు అమలు కాకుండా అపద్దర్మ గుర్తింపు కార్మిక సంఘం టిబిజికెఎస్ మోకాలద్దుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిర్యాల రంగయ్య, కె.సారయ్య, వైవి.రాము, వీరభద్రయ్య, మద్ది ఎల్లయ్య, ఎం.సమ్మయ్య, దమ్మాలపాటి శేషయ్య, వంగా వెంకట్, వట్టికొండ మల్లికార్జున్రావు, ఎస్.వి. రమణమూర్తి, వి. రాజేశ్వర్రావు, ఎం.బాబు, జి.సత్యనారాయణ, ఆసీఫ్ పాషా, కె.రాజేశ్వర్రావు, సాయిపవన్,
జి.నర్సింహారావు, సూర్యప్రకాష్,
జి.నాగేశ్వర్రావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.