మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈనెల 18వ తేదీ నుండి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విగ్రహాల అమ్మకాలు భద్రాద్రి జిల్లా కేంద్రంలో జోరందుకున్నాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద విగ్రహాలకు డిమాండ్ ఉన్నప్పటికీ వాటిని ముందస్తుగానే కొనుగోలు చేసి సిద్ధం చేసుకుంటున్నారు. వినాయక విగ్రహాలు చిన్న సైజు అయితే 5 వేల నుంచి 6 వేల వరకు పెద్ద సైజులు అయితే 10 వేల నుంచి 40 వేల వరకు డిమాండ్ ఉంది. రంగురంగులతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న వినాయక ప్రతిమలను భద్రాద్రి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్, పోస్ట్ ఆఫీస్ ఏరియా, రామాటాకీస్ ఏరియా, పాత బస్ డిపో, సింగరేణి ప్రకాశం స్టేడియం మైదానం ప్రక్కన పెట్టి పలువురు వ్యాపారస్తులు అమ్మకాలను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కువగానే వినాయక మండపాలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది.