బిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ కౌన్సిలర్!
* వెళ్లలేదని చెప్పిన కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి విడుదల చేస్తున్న కోట్లాది రూపాయల నిధులను చూసి అనేకమంది ఆకర్షితులై గులాబీ గూటికి చేరుతున్నారు. ఇటు ప్రజలే కాకుండా అటు ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు కార్యకర్తలు సైతం గులాబీలోకి రావడం పట్ల కొత్తగూడెం నియోజకవర్గంలో ఇక బిఆర్ఎస్ కు తిరుగులేదనే మాట వినపడడం గమనించాల్సిన విషయం. ఆదివారం స్థానిక శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు పలు వార్డుల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రామా టాకీస్ ఏరియాలో 29వర్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్ వనమా సమక్షంలో బిఆర్ఎస్ లో చేరినట్లు ఆ పార్టీ పెద్దలు ప్రకటన విడుదల చేశారు.
బిఆర్ఎస్ లోకి పోలేదు:తంగెళ్ల లక్ష్మణ్
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామటాకీస్ ఏరియాలో స్థానిక శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు పర్యటనకు వస్తే ఆయనకు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి ముందుకు పోయినట్లు కాంగ్రెస్ 29 వార్డు కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్ తెలిపారు.
వినతిపత్రం ఇచ్చిన తర్వాత తన మెడలో బలవంతంగా గులాబీ జెండా వేశారని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ లోకి వెళ్లినట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను మొదటి నుండి కాంగ్రెస్ అభిమానినని ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ను విడిచిపెట్టే ప్రసక్తి లేదని తంగెళ్ల లక్ష్మణ్ స్పష్టం చేశారు.