సింగరేణిలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్!
* మరోసారి చర్చలు నోటిఫికేషన్ విడుదల
* అక్టోబర్ 28వ తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని గత కొన్ని నెలలుగా పలు యూనియన్లు పట్టు బట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎన్నికలు జరపాలని ఇటు సింగరేణి యాజమాన్యానికి అటు చీఫ్ లేబర్ కమిషనర్ కు కొన్ని యూనియన్లు పలు మార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఎన్నికలు జరపాలని స్పందన వచ్చింది. ఇలా ఉండగా సోమవారం హైదరాబాదులోని చీప్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపే దానిపై చర్చ కొనసాగింది. ఈ సమావేశంలో వివిధ యూనియన్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో మరల ఈనెల 22వ తేదీన సమావేశం నిర్వహించి ఆ రోజున ఎన్నికల షెడ్యూలు విడుదల చేయాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టారు. దీనికి రెండు సంఘాలు తప్ప మేనేజ్మెంట్ డిప్యూటీ సిఎల్పీ తో పాటు అన్ని యూనియన్లు ఒప్పుకోవటం జరిగింది. అక్టోబర్ 28వ తేదీన ఎన్నికల నిర్వహించటానికి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఎన్నికలు నిర్వహించేంతవరకు అన్ని యూనియన్లను సమానంగా చూడటానికి అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ కి అన్ని ఏరియాల జిఎంలకి లెటర్ రాస్తామని ఈ సమావేశంలో హామీ ఇవ్వడం జరిగిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు తెలిపారు.