సమ్మె బాట పట్టిన అంగన్వాడి వర్కర్స్
ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 11, అంగన్వాడి వర్కర్స్, వెల్పర్స్, కార్మికుల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నిరవధిక సమ్మె శిబిరంలో మండల వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లంతా పాల్గొన్నారు. ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చండ్ర నరేంద్ర కుమార్, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు పద్మ ఈ సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది మహిళలు ఐసిడిఎస్ లో పనిచేస్తున్నారని తెలిపారు. వీరంతా గత 48 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న, వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అంగన్వాడి కార్యకర్తలకు 26,000 జీతంతో పాటు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సీపీఎం మండల నాయకులు వలమల చందరరావు, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా, ఏఐటియుసి, సిఐటియు నాయకులు భూక్యా లలిత, సీత మహాలక్ష్మి, రాజ్యం, విద్య, రమాదేవి, సావిత్రి, జయలక్ష్మి, స్రవంతి, విజయ, బుజ్జి, తిరుపతమ్మ, పద్మ, అమిన, నాగమణి తదితరులు పాల్గొన్నారు.