మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఓటరు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ ఎన్నికల అధికారి కార్యాలయం నుండి ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం 2023పై జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు వచ్చిన దరఖాస్తుల విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా నూతన ఓటరు నమోదు, జాబితాలో సవరణల కొరకు అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 18, 19 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో నమోదుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి
పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో సవరణలు కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించడంతో పాటు ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ట్రాన్స్ జెండర్లు, కళాశాలల్లో తరచు స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటరు నమోదుతో పాటు ఓటరు జాబితాలో సవరణలపై ప్రజలను చైతన్యపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రావు, కొత్తగూడెం ఆర్డీవో శిరీష, భద్రాచలం ఆర్డీవో మంగీలాల్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.