* ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు
* వైరల్ వైరస్ ఫీవర్లతో జనం బేజారు
* వారం రోజులైనా తగ్గకపోవడంతో ఆసుపత్రులకు పరుగులు
* జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఎక్కువగా జ్వర పీడితులే
* పల్లెల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది
* ఇప్పటికే తీవ్ర జ్వరంతో పలువురు మృతి
* జాగ్రత్తలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దారుణం
* ఫీవర్ సర్వే చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని జనం సూచన
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అసలే వర్షాకాలం.. ఆపై వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో.. ఎప్పుడు ఏ రోగాలు
వస్తాయోనని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.. ఇటీవల ఒకవైపు అడపా కడప వర్షాలు.. మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం వల్ల వైరల్ జ్వరాలు చాప కింద నీరుల ఊపందుకోవడంతో ప్రజల్లో టెన్షన్.. టెన్షన్ నెలకొంది.
భద్రాద్రి జిల్లా కేంద్రంతో పాటుగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు విష జ్వర బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులైనా వీడని జ్వరం తదితర లక్షణాలతో ప్రజలు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. వైరల్ జ్వరం డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులకు దగ్గరగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల కిందట విష జ్వరాల వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామానికి చెందిన నాగమణి (26), కరకగూడెం మండలంలో విలేకరుగా పనిచేస్తున్న అతని కూతురు స్పందన (16), దుమ్ముగూడెం మండలం కొత్త మారేడు బాక గ్రామానికి చెందిన చిన్నారి లావణ్య (6) మృతి చెందడంతో కలవర పెడుతుంది. రెండు మూడు రోజులుగా తేలికపాటి వర్షాలు వాతావరణంలో చిన్న చిన్న మార్పులు వచ్చి వైరల్ వైరస్ విజృంభన చేయడంతో అనేకమంది తీవ్ర చలి జ్వరంతో ప్రజలను మంచాన పడేస్తున్నాయి. ముఖ్యంగా వైరల్ జ్వరంతో దగ్గు, జలుబు, తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు, వాంతులు,
విరేచనాలు తదితర లక్షణాలతో ఉన్నవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రజలు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏజెన్సీ ప్రాంత పట్టణ ప్రాంతవాసులు అనేకమంది జ్వరంతో ములుగుతూ చికిత్స తీసుకుంటున్నారు. దాదాపుగా అన్ని బెడ్లు నిండిపోయి కనబడుతుండడం వల్ల “వైరల్ కిల్లర్” ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు.. అందరినీ చుట్టుముట్టేస్తోంది. ఏజెన్సీ లో ఉండేవారు జ్వరం బారిన పడితే వారు మొదటి
మూడురోజులు స్థానిక ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకున్నా తగ్గకపోవటంతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి రక్తపరీక్షలు చేయించుకుంటున్నారు. వీరిలో ఎక్కువమంది జ్వర లక్షణాలతోపాటు కొంతమందికి జ్వరం తగ్గినప్పటికీ నీరసంతో ఉండి నిలబడలేని కూర్చోలేని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుల వల్ల వైరల్ కిల్లర్ ప్రజలను వెంటాడుతూ భయాందోళనకు గురిచేస్తుంది.
వైరల్ జ్వరాన్ని తేలికగా తీసుకోవద్దు…
వైరల్ జ్వరాన్ని తేలికగా తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకొని వైద్య సదుపాయం క్రమ తప్పకుండా తీసుకోవాలని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మాంసాహారాలకు దూరంగా ఉండాలి. బాడీ డిహైడ్రేషన్ కాకుండా నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. బలమైన పౌష్టికాహారాన్ని ఆకుకూరలు జ్యూసులు తీసుకోవాలి. షేక్ హ్యాండ్ లకు ఆ లింగనాలకు దూరంగా ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కళ్ళు ముక్కును పదే పదే తాగకూడదు. దూరం దూరంగా కూర్చోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే వైరల్ జ్వరం నుండి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.