మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు మున్సిపల్ చైర్మన్ డీవీ
మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని మూడవవార్డులో బస్తీ దవాఖానా నందు ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ఇల్లందు మున్సిపల్ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సరైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు సమగ్ర మహిళ ఆరోగ్య పథకం రూపొందించబడిందని దీనిద్వారా సరైన స్క్రీనింగ్ వైద్యపరీక్షలు, వ్యాధినిర్ధారణ చికిత్స, మందులు పంపిణీ ఫాలోఅప్ సేవలు అందించబడుతాయని తెలిపారు. అన్ని వయస్సులలో గల మహిళలకు ఎనిమిది రకాల సర్వీస్ ప్యాకేజీలు ఈ పథకం ద్వారా అందించబడతాయన్నారు. మహిళ ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యమని, మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. ఇంతటి మంచి అవకాశాన్ని పట్టణంలోని మహిళలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది, ఆశావర్కర్లు, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, మహిళా నాయకురాలు కొక్కుసరిత, వినోద్ తదితరులు పాల్గొన్నారు.