మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె నాల్గవరోజులో భాగంగా టేకులపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన దీక్షాశిబిరాన్ని గురువారం జెడ్పీఛైర్మెన్ కోరం కనకయ్య సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కోరం మాట్లాడుతూ..అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ తరుపున అండగా ఉంటామని హామీనిచ్చారు. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీసవేతనం ఇరవై ఆరువేల రూపాయలు అందించడంతో పాటుగా పెన్షన్, ఉద్యోగ భద్రత, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, సొసైటీ డైరెక్టర్ ఉల్లోజీ ఉదయ్, మాజీ సర్పంచ్ రెడ్యానాయక్, కోరం సురేందర్, రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.