మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 14::
మండలంలో ఉన్న మీసేవ నిర్వాహకులు తమకున్న సమస్యల సాధనకై స్థానిక తహసిల్దార్ చంద్రశేఖర్ కు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మీ సేవా కేంద్రాల నిర్వాహణ భారంగా మారిన నేపథ్యంలో సేవలను, కమీషన్లను పెంచాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశామన్నారు. మీ సేవా కేంద్రాలను 2011 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్థాపించారని, నాటి నుంచి పలు ప్రభుత్వ,ప్రైవేటు రంగ సేవలను అందిస్తున్నప్పటికీ మీ సేవా కేంద్రాల నిర్వహణ ఆర్ధికంగా భారంగా మారిందన్నారు. డిజిటల్ సేవలు మరింత సులభతరం చేస్తూ సేవలందిస్తున్నప్పటికీ మీ సేవా కేంద్రాల నిర్వాహ కులకు ఇచ్చే కమీషన్ పెరగలేదని, ఆనాటి స్లాబ్ కమీషనే నేటికీ కొనసాగుతుండడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, సేవలు, కమీషన్ల పెంపు చేట్టాలని కోరారు. కార్యక్రమంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు బాలాజీ శ్రీనివాస్, అనిల్ కుమార్, రమేష్, సమ్మయ్య పాల్గొన్నారు.