మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని 24 ఏరియాలో కుక్కలు స్వైరవిహారం చేస్తూ చిన్నారులు, పెద్దలపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. శనివారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు చిన్నారులను మైనార్టీ పాఠశాల సమీపంలో వీధికుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. గాయపడిన చిన్నారులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించిన అనంతరం ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా గాయపడిన చిన్నారుల తల్లితండ్రులు, స్థానికులు మాట్లాడుతూ..పట్టణంలో ముఖ్యంగా 22, 23, 19వార్డులలో పదులసంఖ్యలో కుక్కలున్నాయని, వార్డులలో కుక్కల స్వైరవిహారం వల్ల పెద్దలు సైతం బయటికి రావాలంటేనే గజగజవణికే పరిస్థితి నెలకొందని అన్నారు. కోతుల బెడదను నివారించడంలో పూర్తిగా విఫలమైన మున్సిపల్ పాలకవర్గ అధికారులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న వీధికుక్కల సమస్యను కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేసారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అదేవిధంగా చికెన్ షాపులలో వేస్టేజ్ మాంసం ముక్కలను తీసుకొచ్చి వార్డులలో గల కుక్కలను వేస్తున్నారని వాటికి అలవాటు పడిన కుక్కలు మనుషులను కరిచెందుకు ఎగబడుతున్నాయని వారు పేర్కొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కుక్కల, కోతుల బెడదను నివారించి మనుషుల ప్రాణాలకు భద్రత కల్పించాలని కోరారు.
