టికెట్ ధీమాతో తాటి?
తుమ్మల అభయహస్తం ఇచ్చారా?
ఆనందంలో తాటి అనుచరులు!
మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 16: అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో 8 మంది ఆశావహులు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. స్క్రీనింగ్ టెస్ట్ కు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఈ ముగ్గురిలో ఎవరికి వారే టికెట్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో టికెట్టు నాకొస్తుందంటే నాకు వస్తుంది అంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా ఎవరికి వారే ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్, విధివిధానాలను ప్రచారం చేసుకుంటున్నారు. టిక్కెట్టు ఎవరికి వచ్చినా మీరు ఆదరించాలంటూ పైకి చెప్తున్నప్పటికీ ఎవరి వర్గం ప్రజలకు వారు టికెట్ నాకే వస్తుంది గెలిపించండి అంటూ లోలోపల ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తాటి వెంకటేశ్వర్లు గత ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్టు ఎవరిని వరిస్తుందోనని ఎదురుచూస్తున్న తరుణంలో, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న సందర్భంలో అశ్వారావుపేట రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో గత రాజకీయాలలో మాజీ మంత్రి తుమ్మల తో కలసి పనిచేసిన స్నేహం కలిగి ఉండడంతో తాటి వెంకటేశ్వర్లకు టిక్కెట్ విషయంలో బలం చేకూరిందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి తుమ్మలతో సాన్నిహిత్యం కలిగి ఉన్న తాటి వెంకటేశ్వర్లుకు టికెట్ విషయంలో మాజీ మంత్రి తుమ్మల అభయహస్తం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఒకే పార్టీలో ఉన్నప్పుడు తుమ్మల పొంగులేటి ల మధ్య ఉన్న వివాదాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు మాజీ మంత్రి తుమ్మల అభయం ఇచ్చారనే గుసగుసలు బలంగానే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని బడా నాయకులు సైతం తాటికే సపోర్టు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో తాటి వెంకటేశ్వర్లు అనుచరులు ఆనందంలో తేలియాడుతున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గ పోరు ఎవరికి లాభం చేకూరుస్తుందో ఎవరికి నష్టం చేకూరుస్తుందో వేచి చూడాల్సిందే.