వినాయక మండపాలు జిగేల్
* విద్యుత్ కాంతులతో దగదగా
* ఆకర్షణగా నిలిచిన వినాయక విగ్రహాలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
వినాయక ఉత్సవాలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు విద్యుత్ కాంతులతో జిగేల్ మంటున్నాయి. సోమవారం నుండి తొమ్మిది రోజులపాటు వినాయక ఉత్సవాలను నిర్వహించేందుకు నిర్వాహకులు వినాయక మండపాలను సిద్ధం చేసి వాటి చుట్టూ విద్యుత్ బల్బులు అమర్చడం వల్ల రాత్రి సమయంలో వినాయక మండపాలు బ్రహ్మాండంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని సింగరేణి స్టేడియం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం విద్యుత్ కాంతులతో దగదగలాడుతుంది. బస్టాండ్ సెంటర్, పోస్ట్ ఆఫీస్ ఏరియా, సూపర్ బజార్ లేపాక్షి సెంటర్, చిన్న బజార్, పెద్ద బజార్, రుద్రంపూర్, రామవరం ప్రాంతాల్లో భారీగా వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. వినాయక ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులపాటు పలు ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొననున్నది.