మన్యం న్యూస్ సెప్టెంబర్ 19 దుమ్ముగూడెం::
తునికి ఆకు సేకరించిన కార్మికులందరికీ పెండింగ్ బోనస్ విడుదల చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం జిల్లా నాయకులు మర్మం చంద్రయ్య మాట్లాడుతూ.. 2016 నుండి 2021 వరకు తునికాకు సేకరించిన బట్టిగూడెం గ్రామానికి చెందినటువంటి 60 మంది కార్మికులకు బోనస్ నిధులు జమ కాలేదని తక్షణమే వారికి నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు పూర్తి విచారణ సేకరించి కార్మికులందరికీ నగదు జమ చేసే విధంగా కృషి చేయాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మండల వ్యాప్తంగా తునికాకు బోనస్ మంజూరు అవ్వని కార్మికులందరికీ విడుదల చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు చిలకమ్మా, లక్ష్మి, ప్రభాకర్, ముత్యాలక్క, లక్ష్మయ్య, లక్ష్మి, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.