మన్యం న్యూస్, అశ్వారావుపేట(దమ్మపేట), సెప్టెంబర్, 20: దమ్మపేట మండలం, ఆర్లపెంట గ్రామంలో ఆదివాసి చట్టాలపై అవగాహన కార్యక్రమం ఆదివాసి నాయకులు తోలం శ్రీను అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు, అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసి సేన ఎమ్మెల్యే అభ్యర్థి ఉకె రవి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డకు ఆదివాసి చట్టాలపై అవగాహన ఉండాలని అన్నారు. అటవీ హక్కుల చట్టం, పీసా గ్రామసభ, 1/70 చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మొదలైన చట్టాలతో పాటు సాంస్కృతి సాంప్రదాయాలు హక్కులు పై అవగాహన కల్పించారు. ఏజెన్సీ గ్రామాల్లోకి ఓట్లు కోసం వస్తున్న వివిధ పార్టీల నాయకులను ఆదివాసి చట్టాలతో పాటు సమస్యలను బాండ్ పేపర్ ద్వారా తెలుపుతూ నెరవేర్చాలని సంతకాలు వీడియోలు తీసుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి మండల నాయకులు, గ్రామ మహిళలు యువకులు పలువురు పాల్గొన్నారు.