సింగరేణి జూనియర్ అసిస్టెంట్ నియామకాల భర్తీకి హై కోర్టు రైట్
* త్వరలో నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం
* డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్
ఎన్.బలరామ్
* హర్షం వ్యక్తం చేస్తున్న పరీక్ష రాసిన అభ్యర్థులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఏడాది క్రితం సింగరేణి సంస్థ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్) పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లోని ద్విసభ్య ధర్మాసనం గురువారం అనుమతిస్తూ తన తీర్పును ప్రకటించింది. ఇటీవల ఇదే పరీక్షను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం విదితమే. కాగా ఈ తీర్పును సింగరేణి సంస్థ పరీక్ష రాసిన అభ్యర్థులు సవాలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి, జస్టిస్ అనీల్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సింగరేణి వాదనలతో ఏకీభవిస్తు సింగరేణి సంస్థ ఏడాది క్రితం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష ను సమర్థించింది. ఆ పరీక్ష ఫలితాలపై అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలలో నియమించే ప్రక్రియను సింగరేణి సంస్థ కొన సాగించవచ్చని పేర్కొంది. దీంతో ఏడాదికాలంగా నిరీక్షిస్తున్న అర్హులైన అభ్యర్థుల కలలు నిజం కానున్నాయి.
2022 సెప్టెంబరు 4వ తేదీన సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కోసం తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో 187 పరీక్ష కేంద్రాలలో సింగరేణి సంస్థ రాత పరీక్షను నిర్వహించింది. ప్రముఖ జే ఎన్ టి యు హెచ్ విద్యాసంస్థ నిర్వహణలో ఈ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 98, 882 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 77,907 మంది అభ్యర్థులు రాత పరీక్షలో పాల్గొన్నారు. కంప్యూటర్ ఆధారిత మూల్యాంకనంలో 49,328 మంది అభ్యర్థులు కనీస అర్హత సాధించారు.
అయితే కొందరు అభ్యర్థులు జేఎన్టీయూ నిర్వహించిన పరీక్ష పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పరీక్షను రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో ఏడాదికాలంగా విచారణ కొనసాగింది. గత నెలలో ఈ రాత పరీక్షను రద్దు చేస్తున్నట్లు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై పరీక్ష రాసిన అభ్యర్థులు దిగ్భ్రాంతి ప్రకటించగా సింగరేణి యాజమాన్యం కూడా తన అభ్యంతరం తెలుపుతూ ద్విసభ్య బెంచ్ ని ఆశ్రయించడం జరిగింది. పరీక్షను పూర్తి పకడ్బందీ ఏర్పాట్లతో పారదర్శకంగా నిర్వహించామని మానవ ప్రమేయ రహితంగా కంప్యూటర్ ఆధారిత మూల్యాంకనం నిర్వహించామని, దాదాపు 70 వేల మంది తెలంగాణ అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలకు సంసిద్ధమై పరీక్షలు రాశారనీ కనుక పరీక్షలు రద్దు చేయడం తగదని పై కోర్టును కోరింది .
దీనిపై ద్విసభ్య బెంచ్ విచారించి తీర్పును వెలువరించింది. పరీక్షను రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును పక్కకి పెడుతూ, నాడు నిర్వహించిన పరీక్ష ఆధారంగా నియామక ప్రక్రియను కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ పర్సనల్ ఎన్.బలరామ్ మాట్లాడుతూ కోర్టు వారు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో సింగరేణి తరఫున బలంగా వాదనలు వినిపించిన స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ సంజీవ్ కుమార్ (ఆఫీస్ ఆఫ్ అడిషనల్ ఏజీ), సింగరేణి స్టాండింగ్ కౌన్సిల్ హర్షా రెడ్డిని, సింగరేణి న్యాయ విభాగం అధికారులను అభినందించారు. అతి త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.